Sunday, December 13, 2020

Telugu Poem 29: అనుభవించాల్సిందే

ప్రతి మనిషిలో ఉంటుంది ఒక కోరిక ,
అది ఏదైనా, ఎంతైనా.

లెక్క పెట్టగలిగే ,
నూరు వరాహలు ,
వేయి వాహనాలు ,
లక్ష సంపదలు ,
కోట్ల భవనాలు నుండి ,

లెక్క పెట్టలేని ,
గుర్తింపు , గౌరవం ,
మనసులో సంతోషం ,
చేతల్లో ఆప్యాయం ,
జీవితానికి ఒక కారణం,

అది ఏదైనా ,
లెక్క పెట్టగలిగే కోరికల నుండి ,
లెక్క పెట్టలేని కోరికలకు చేరితే ,
వచ్చే మనస్పూర్తి ,
అనుభవించాల్సిందే. 

Telugu Poem 28: ఒక్క అడుగు ముందుకెయ్

మాటలు వినీ వినీ విసిగిపోయా ,
చేతల కోసం తపిస్తున్నా ,
అగ్నిపర్వతం లో ఉన్న లావాలా ,
మూత కింద దాక్కున్న ఆవిరిలా ,
ధ్వంసం చెయ్యటానికి సిధ్ధమైన భూకంపంలా ,
ఉప్పెనతో పొంగటానికి ఆగలేని సునామీలా ,
నీలో ఉన్న శక్తికి సంకెళ్ళు తీసి,
నమ్మకానికి ప్రాణం పోసి ,
గుండెకి బలం పెట్టి ,
మడమ తిప్పరాని సంకల్పంతో,
చదరని ఆత్మవిశ్వాసంతో ,
కసితో ,
ఒక్క అడుగు ముందుకెయ్.

Telugu Poem 27 : ఒక చిన్న ఆశ

ఊహ తెలిసిన పసికందుకి ,
తెలియునా తరతరాల చరిత్ర ,
చెప్పటానికి ఉంది అమ్మ అమ్మమ్మే ,
నూరేళ్ళు అరవై ఏళ్లకే వచ్చే ఈ కాలం ,
ఎప్పుడు అంతం అయ్యేది ,
శతాబ్దాల చరిత్ర ముని మన వళ్ళతో ,
పంచుకునే కాలం ,
ఎప్పుడు మన ముందుకు వచ్చేది ,
ఆరోగ్యం మీద ఆసక్తి ఎప్పుడు పెరిగేది ,
ఆలోచించే విధానం ఎప్పుడు మారేది ,
జీవితాన్ని ఒక ఆలయంలా ఆస్వాదించేలా ,
ఆ ఆలయానికి నేనే దేవున్ని అని గుర్తించేలా ,
మార్పు రావాలి ,
అప్పుడే ఆ పసికందు కేకలు ,
పలు తరాలు చేరేవి ,
అమ్మ, అమ్మమ్మ నుండి ముని అమ్మమ్మ వరకు ,
ప్రతి ఒక్కరి కాలం నుండి అనేకమైన జీవిత కథలు ,
వ్రాయక పోయినా ,
నోటితో , ప్రేమతో , స్పర్శతో ,
ఆ పసికందుకు నూరేళ్ళ వరకు సరిపోయే ,
జీవిత జ్ఞానం కలిపిస్తారని ఒక చిన్న ఆశ .